విశాఖపట్నం: తాను ఎవరికీ భయపడబోనని, తానేంటో నిరూపించుకుంటానని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతిరాజు తెలిపారు. తన పనితీరు చూడకుండానే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపిస్తానన్న నమ్మకాన్నివ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. చీకటి జీవోతో తాను పదవి దక్కించుకున్నానని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. చట్టబద్ధంగా తాను ట్రస్ట్ చైర్‌పర్సన్ అయ్యానని స్పష్టం చేశారు.
గతంలో అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని ట్రస్ట్ సభ్యురాలిగా నియమించి తనను విస్మరించారని వాపోయారు. ఆ రోజు తనను ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించారు. తన పట్ల టీడీపీ నాయకుల వ్యాఖ్యలు వివక్షాపూరితంగా ఉన్నాయని, మహిళలకు వారసత్వ హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా పనిచేయగల సామర్థ్యం తనకు ఉందన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో 60 శాతానికిపైగా బాలికలు ఉన్నారని వెల్లడించారు. మహిళలను తక్కువగా అంచనా వేయడం సరికాదని హితవు పలికారు. (చదవండి: మాన్సాస్‌లో పెనుమార్పు..!)